సూత్రవృత్తి
ఆధునికాంధ్ర సాహిత్య సృష్టి, వ్యాప్తి, వినియోగం పెరగటం వల్ల, దాన్ని విమర్శించే సూత్రావశ్యకం పెరిగింది. ఆధునిక సృజన సాహిత్యారంభంలోనే విమర్శారంభం జరిగినా అది విస్పష్టం కాలేదు. తెలుగులో తక్కువగా ఉన్న విమర్శనం కోరుకోదగ్గ క్రమతతోలేదు.
నేటి విమర్శనంలో ప్రాచ్య, పాశ్చాత్య ధోరణులున్నాయి. ప్రాచీన, సంప్రదాయ, నవ్య సంప్రదాయ విమర్శకు ప్రాచ్య పద్ధతి చెల్లుతూ ఉంది. ఆధునిక సాహిత్య విమర్శకు పాశ్చాత్య పద్ధతి సక్రమంగానే ఉంటుంది కానీ, దీని మీద ప్రాచ్య ప్రభావం పడుతూ వుంది. ప్రాచ్య సంప్రదాయం ప్రాచీనాలంకారిక రీతి మీద, పాశ్చాత్య సంప్రదాయం విభిన్న పాశ్చాత్య దేశాల విమర్శ విధానం మీద ఆధారపడి ఉన్నాయి.
ఆధునిక సాహిత్యం ప్రాచీనం కంటే భిన్నం కాబట్టి ప్రాచీన లక్షణాల కంటే భిన్న లక్షణాలతో పరిశీలించటం అవసరంగా ఉంది. ప్రాచ్య దృక్పథం ఈ సాహిత్యానికి సంపూర్ణంగా వర్తించదు. కారణం, ఇది పరిణామ సాహిత్యం. ప్రాచీనం కాదు. పాశ్చాత్య దృక్పథం అన్ని అందాలా దీనికి అనువర్తించదు. కారణం, ఇది ఆంధ్రదేశ సాహిత్యం. పాశ్చాత్యం కాదు.
ఆధునిక సాహిత్యం విమర్శించటానికి ఏమీ లేదని పండితులు భావిస్తున్నారు. పాఠ్యాంశమయినప్పుడు బోధించటానికేమీలేదని అధ్యాపకులు అంటున్నారు. విమర్శావసరంలో రూప లక్షణాలు గుర్తించినంతగా వస్త్వంశాలు దర్శించటంలేదు. పరిశోధనలో సాధన సంపత్తి లేక లోతులు వెలుగు చూడటం లేదు. పండితావగాహనకు, పాఠ్యాంశ బోధనకు, విమర్శ వివేకానికి, పరిశోధన ప్రతిష్ఠకు, ఆధునిక సాహిత్య విమర్శ సూత్రం అవసరమన్న అభిప్రాయం ఏర్పడింది.
నేటి తెలుగులో భిన్న కాలాలలో, భిన్న సామాజిక నేపథ్యాలలో, ప్రభవించిన భిన్న సాహిత్య దృక్పథాలున్నాయి. ఆ దృక్పథ ముఖంగా ఆ సాహిత్యం పరిశీలించటం ధర్మం. అందువల్ల ఏ సాంఘిక హేతువులు, ఈ నూత్న సాహిత్య సృష్టికి కారణమయ్యాయో గుర్తించి, ఆ సాహిత్య స్వరూప స్వభావాలు స్థూలంగా పరికించి, దాని విమర్శకు స్వీకరింపదగ్గ అంశాలను సూత్రంగా రూపొందించటం ఈ ప్రయత్నానికి లక్ష్యం. అవసరమయినప్పుడు నూత్న లక్షణాలు నిర్ణయించటం, సమన్వయించటం, నేటి సాహిత్యాంతస్సూత్రం గ్రహించటం, ఈ ప్రయత్నంలో ప్రముఖాంశాలు. ఆధునికతను వివరించి, దాని వ్యాప్తి సాహిత్యంలో సాధించిన చైతన్యం పరిశీలించి, నేటి సాహిత్య తత్త్వ దర్శించటమయింది. సంస్కరణ వాదం నుంచి, దళితవాదం దాకా సాహిత్యం పొందిన క్రమ వికాసంలోని ఏకసూత్రతను గ్రహించి, విమర్శ కేంద్రంగా దాన్ని పరిశీలించటం జరిగింది. నేటి సాహిత్య విమర్శనంలోని సార్వికత్రయ, అభివ్యక్తి విమర్శౌన్నత్య భ్రమలు దూరీకరించి, వస్తువు, విలువలు, గుణాలు పరిశీలించి, సాహిత్య సౌందర్య శాస్త్ర తత్త్వం, ప్రక్రియా పరిణామం గుర్తించి, చేసిన కృషివల్ల విమర్శ సూత్రం ఆవిర్భవించింది. దీని వినియోగం సహృదయాధీనం.
డా.సి. నారాయణరెడ్డి, యూనివర్సిటీ ఉపాధ్యక్షులు, డా. కేతు విశ్వనాథరెడ్డి, ఆంధ్రశాఖాధ్యక్షులు, డా. బి.ఆర్. అంబేద్కరు సార్వత్రిక విశ్వవిద్యాలయం కోరగా నేను విద్యార్థుల ఉపయోగార్థం వ్రాసిన విమర్శ వ్యాసభాగాలు నాలుగు ఈ గ్రంథంలో చోటుచేసుకొన్నాయి.
ఈ గ్రంథం వ్రాత ప్రతిని చదివి, ప్రూఫు చూచి, ఉపయుక్త గ్రంథసూచి డా|| (కుమారి) కొలకలూరి మధుజ్యోతి సిద్ధం చేసింది. శ్రీ చంద్రది ముఖచిత్రం, పద్మావతి ఆర్ట్ ప్రింటర్సుది ముద్రణ. వీళ్ళకు నా అభినందనలు.
అనంతపురం
6.6.96 ఆచార్య కొలకలూరి ఇనాక్